Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

నారీమణుల సౌశీల్యం

వీర పురుషుల శౌర్యంకంటే కూడా నారీమణుల సౌశీల్యమే దేశానికి శ్రీరామరక్ష కాగలదు.

''యత్సౌశీల్యం జనకతనయాః యస్త్వయి ప్రేమభూమా

యస్త్వచ్చౌర్య ప్రణయగరిమా, యాప్యవజ్ఞాదళాస్యే

యాచాహంతానికిశిచరపతేః తత్సమస్తం వ్యనక్తి

ప్రత్యక్షం మే రఘువర, తయో స్సంప్రవృత్తోవిషాదః ''

శ్రీఆంజనేయ స్వామివారు సీతాన్వేషణం చేస్తూ ప్రపంచమంతా తిరిగి చివరకు అశోకవనంలో ఆమెను కనుగొన్నారు. ఆమెతో మాట్లాడి, అక్కడనుంచి ప్రత్యభిజ్ఞాపక చిహ్నాన్ని కూడా తీసికొని వచ్చినపుడు రాములవారు యిలా ప్రశ్నించారు- ''పరరాజ్యంలో, పరహస్తములయందు చిక్కిన స్త్రీ ఎంతో కష్టం మనుభవిస్తుంది. ఇంత కష్టం అనుభవించినా, సీత సౌశీల్యం భద్రంగా వున్నదా? నాయందు స్మరణంవున్నదా ?'' దానికి ఆంజనేయులవారిచ్చిన సమాధానం చూడండి.

''లంకాధీశ్వరుడైన దుష్టరావణుడు సీతామ్మవారి వద్దకువచ్చి; దుష్టవచనాలు మాట్లాడటం, దానికి ఆ మహాతల్లి యిచ్చినసమాధానం-నేను చెట్టు ఆకులమధ్యన కూర్చుని స్వయంగా విన్నాను, వారుభయుల మాటలు నేను విన్నది విన్నట్లు మీకు చెబుతాను. సీతామహాసాధ్వి సౌశీల్య మెట్టిదో మీకే అవగత మవుతుంది.''

ఆంజనేయస్వామివారు చదివిన పైశ్లోకాన్ని బట్టి జనక తనయసౌశీల్యం యిలా గ్రహించాలి, ఆ శ్లోకంలో ''యస్త్వయి ప్రేమ భూమా'' -అనడంచేత ఆమెకు శ్రీరామునిపట్ల గల ప్రేమ భావం వ్యక్తమవుతోంది. ''యస్త్వచ్చౌర్య ప్రణయ గరిమా'' --అన్న వాక్యం చేత ఆ దివ్యపురుషుని పరాక్రమాన్ని భావించినపుడు అతనియెడ ఆమెకు గల ప్రేమాధిక్యం ఎలా పెల్లుబుకుతోందో తెలుస్తుంది. రాములవారి శౌర్యం అప్రతిహతమని ఆమె విశ్వాసం.

దీంతోపాటు ''యాప్యవజ్ఞా దశాస్యే'' ఆ రావణునిపట్ల తృణీకారంలో గడ్డిపోచకంటేకూడా నిర్లక్ష్యం భావం ఆమెలో కనపడింది. ఆమెకు రావణునిపట్ల ఎంత తృణాకారం వున్నదో, రావణునికి అంత అహంకారం కూడా వున్నది. అదే అతడి ''అహంత''.

కాగా ఈశ్లోక తాత్పర్యం ఏమంటే- ఆ సీతారావణుల సంవాదంవల్ల ఆంజనేయస్వామి తాను గ్రహించిన సీతా సౌశీల్యమును రాములవారికి వివరించాడు.

ఆ సీతాదేవి సౌశీల్యం రావణుని అహంకారమును కూడా తృణీకరించగలిగినంత ఉత్కృష్ట మైనది. ఏకుటుంబంలో, ఏదేశంలో ఉత్తమమైన తల్లులకు మంచి శీలం వుంటుందో ఆ కుటుంబానికి, ఆ దేశానికి ఎంత విపత్తువచ్చినా- అవతరిస్తాయి. వీరపురుషుల శౌర్యంకంటే, నారీమణుల సౌశీల్యమే దేశానికి శ్రీరామరక్ష, అదే అన్నిటినిదహిస్తుంది. ఎంతెంత సౌశీల్యం పెంపొందుతుందో అంతగా దేశానికి ఉన్నతి కలుగుతుంది. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో మరువకండి- ఉత్తమబ్రహ్మచారులైన శ్రీఆంజనేయస్వామివారు. అయితే, ఆ సీతారావణుల సంవాద మేమిటో చెప్పవలసిందని రాములవారు కోరగా ఆంజనేయ స్వామి ఇలా చెప్పారు.

శ్రీరామచంద్రుని నిందిస్తూ రావణుడు పలికిన శ్లోకమిది-

''అతల్పం ని ద్రాళుః రజనిషు కువాక దుర్గత తమః

మహాకాతర్యాఢ్యః మనసి విధుత ప్రోజ్జ్వ లయశాః

వధా న్మాంసా దానం బహు విమతలాభో జనకజే.''

దీనితాత్పర్యం ఏమిటంటే-రాముడు శయ్యలేకుండా రాత్రిపూటనిద్రిస్తాడు. కువాక్కులు పలుకుతాడు, ప్రియమైన హితవాక్యం చెప్పడు, దరిద్రం అనుభవిస్తున్నాడు, అన్నిటి కంటే పిరికివాడు, ఏది చూచినా భయపడువాడు, మాంసం తింటాడు అట్లాంటివాడు, ''కథంశ్లా ఘ్యోరామః'' అటువంటి రాముని నీవు ఎలా శ్లాఘిస్తున్నావు? అతడు నగరాలు విడిచి అడవుల పాలైనాడు. ఖరదూషణాదులను చంపి పెద్దనష్టం పొందాడు. చివరకు భార్యే కనిపించని నష్టం కలిగింది. అందువల్ల రాముడు శ్లాఘ్యుడుకాడు - అని రావణుడు చెప్పగా సీతాదేవి ఇలా బదులు చెప్పింది.

8-7ొ

''ఖల తం అసకృత్‌ మా స్పృశగిరా''

ఓదుర్మార్గుడా! నీ వాక్కుతో ఆమహాపురుషునిస్పృశించవద్దు-అంటే అతని నామమైన పలుకుటకు నీకు యోగ్యత లేదని మృదువుగా చెప్పింది, స్త్రీ సహజమైన లజ్జావిషయాలు కూడా ఈ సమాధానంలో స్పష్టం అవుతున్నాయి.

అయితే ఆంజనేయస్వామి నవవ్యాకరణవేత్త. ఇప్పుడు మనకు పాణిని వ్యాకరణ మొక్కటే ప్రధానంగా వుంది. ఐంద్రియాదివ్యాకరణాలు తొమ్మిది, ఆయనకు తెలుసు అంతేకాక మహాభక్తుడు, అందువల్ల అమ్మచెప్పిన మాటలోని మరొక విశేషభావాన్ని యిలా గ్రహించాడు.

ఖల అంటే దుర్మార్గుడని అర్థం కనక ఆ పుణ్యపురుషుడైన రాముని గురించి మాట్లాడే అధికారం దుర్మార్గుడైన రావణునికి లేదని సీతాదేవి తాత్పర్యం.

''తం''-అంటే ''అతనిని'' అనే అర్థం కాకుండా ''అతల్పం నిద్రాళుః'' అనే శ్లోకంలోని తకారాలన్నింటినీ ఒక్కసారి కూడా (అసకృత్‌) ఉచ్చరించ కుండా-శ్లోకంలోని తక్కిన మాటల భావాన్ని మాత్రమే గ్రహించాలని ఆజగన్మాతక వాక్కులోని వైశిష్ట్యంగా ఆంజనేయస్వామి గ్రహించాడు. ఆ శ్లోకాన్ని ఆ ప్రకారం తిరిగి చదువుకొంటే అమ్మవారు సూచించిన ప్రధానార్థం గోచరిస్తుంది.

''మొదటిది-అల్పనిద్రాళుః'' అని వస్తుంది. ''అల్పాహారో, అల్పనిద్రః'' అని రామునిగురించి వాల్మీకి చెప్పిన దానికి యిది సరిపోతుంది, మహాపురుషులు ఎప్పుడు ఏం భుజిస్తారో, ఎక్కడ ఎప్పుడు నిద్రిస్తారో ఎవరికీ తెలియదు, రాములవారు అట్టివారు.

రెండవదానిలో ''తకారాలు'' తీసేస్తే ''కువాక్‌ దుర్గమః''అని వస్తుంది. అంటే కువాక్కులకు దుర్గముడని అర్థం, వాటికి వారివద్దకు వెళ్ళడానికి కూడా అర్హతలేదు.

తర్వాతమాట- ''మహాకార్యాఢ్యః'' అని వస్తుంది. దేవకార్యనిర్వహణం. దుష్టనిగ్రహం, శిష్టరక్షణం, చెయ్యడం వారి కార్యము అని అర్థం.

''పైమాట ''విధుప్రోజ్జ్వలయశాః'' అని వస్తుంది. అంటే చంద్రకాంతివంటి కీర్తిగలవాడని అర్థం. ''బహువిమలాభః''అనేది అనంతరపదం, ఆయనకాంతి కూడా మిక్కిలి స్వచ్ఛమైనదని అర్థం.

''కాగా, దేశంలోని సాధ్వీమణుల సౌశీల్యంవల్లనే సమస్తలాభములూ చేకూరగలవని దీని తాత్పర్యం.'' ఇటువంటి పవిత్రమైన రామాయణగాథ మనదేశంలోనే కాక జావా, కంబోడియాలవంటి దేశాంతరాలలో కూడా వ్యాపించింది. తర్వాత బౌద్ధం, యిస్లాంమతాలు వ్యాపించినప్పటికీ అక్కడి వారు ఈరామాయణగాథలను యింకా స్మరించకుంటూనే వున్నారు. ఆంజనేయస్వామి భక్తి, సీతామహాతల్లి పాతివ్రత్యం, రాముని ఋజుమార్గం, భరతలక్ష్మణుల భ్రాతృభక్తి -దీని వైశిష్ట్యానికి కారణాలు.''


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page